రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడంతో, పదేళ్ళపాటు హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగేలా విభజన చట్టం చేశారు. తదనుగుణంగా ఏపీ ప్రభుత్వం పాలన కోసం హైదరాబాద్‌లో అనేక భవనాలను ఏపీకి కేటాయించింది.
అయితే అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన ఆరు నెలల్లోనే హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులతో సహా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను, కార్యాలయాలను విజయవాడ తరలించుకుపోయారు. కానీ ఆ తర్వాత కూడా అనేక భవనాలు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉండిపోయాయి.
జూన్ 2వ తేదీతో రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తవుతుంది. దాంతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హోదా కూడా రద్దు అయ్యి ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా మారుతుంది. కనుక హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ పదేళ్ళలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విభజన సమస్యలను పరిష్కరించుకోలేకపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో షెడ్యూల్ 9,10 కింద ఆస్తుల విభజన, అప్పులు, ఇంకా కొంతమంది ఉద్యోగుల విభజన వంటివి అపరిష్కృతంగా ఉండిపోయాయి.
వాటన్నిటినీ కూడా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కనుక సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 18వ తేదీన మంత్రివర్గం సమావేశం నిర్వహించి విభజన సమస్యలపై చర్చిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.