తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి ముగియడంతో సిఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ బుధవారం సచివాలయం చేరుకొని పాలనకు సంబందించిన పనులు పునః ప్రారంభించారు. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సచివాలయంలో వివిద శాఖల ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది.
ఆగస్ట్ 15లోగా రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చినందున దానిని అమలు చేసేందుకు నిధులు సమకూర్చేందుకు ఆసక్తి గల బ్యాంకర్లతో సంప్రదింపులు ప్రారంభించాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ లోగా రుణమాఫీకి విధివిధానాలు రూపొందించి అర్హులైన రైతులను గుర్తించే కార్యక్రమం కూడా పూర్తిచేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వీలైనంత త్వరగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సన్న బియ్యం అందజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మంత్రులందరూ తమ తమ శాఖలకు సంబందించి పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయడం ప్రారంభించారు. ఎన్నికల హడావుడి ముగిసినందున ఇక నుంచి రాజకీయాలు పక్కన పెట్టి పరిపాలనకే పూర్తి సమయం కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పధకాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నిటినీ అమలుచేస్తామని చెప్పారు.