సోమవారం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో అర్దరాత్రి వరకు 64.93 శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో సాయంత్రం 4వరకు, మిగిలిన ప్రాంతాలలో 6 గంటల వరకు ఓటర్లను పోలింగ్ కేంద్రాలలోకి అనుమతించి, వారందరూ ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో 1400 పోలింగ్ కేంద్రాలలో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరిగింది.
గత లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో 62.69 శాతం నమోదు కాగా ఈసారి 64.93 శాతం పోలింగ్ నమోదైంది. విద్యావంతులు ఎక్కువగా ఉండే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ఎప్పటిలాగే అతి తక్కువ 46.08, 48.11 శాతం నమోదు కాగా, రాష్ట్రంలో అత్యధికంగా భువనగిరిలో 76.47, జహీరాబాద్లో 74.54 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాలలో పోలింగ్ ముగిసిన తర్వాత ఎంత శాతం పోలింగ్ జరిగిందో ఎన్నికల సంఘం నేడు తెలియజేయనుంది.
చెదురు ముదురు ఘటనలు తప్ప రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంలన్నిటినీ పటిష్టమైన భద్రత మద్య స్ట్రాంగ్ రూములకు చేర్చి భద్రపరిచామని, స్ట్రాంగ్ రూమ్స్ చుత్తూ పటిష్టమైన మూడంచెల భ్రద్రత ఏర్పాటు చేశామని, చుట్టుపక్కల సెక్షన్ 144 అమలులో ఉంటుందని చెప్పారు. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని వికాస్ రాజ్ తెలిపారు.