అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు శనివారం ఉదయం కర్నూలు జిల్లాలోని నంద్యాలలోని తమ కుటుంబ స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. అదే స్థానిక డీఎస్పీ, ఎస్పీ, సీఐ, ఎస్సైల కొంప ముంచింది.
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల నుంచి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేస్తుండటంతో, అల్లు అర్జున్ మద్దతు కోసం వారిని తన ఇంటికి ఆహ్వానించారు.
ఈ విషయం తెలిసే వెళ్ళారో తెలియకనే వెళ్ళారో తెలీదు కానీ అల్లు అర్జున్ దంపతులు హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం నంద్యాల పట్టణం శివారుకి చేరుకునే సరికి అక్కడ వేలాదిగా అభిమానులు, వైసీపి కార్యకర్తలు వారి కోసం కార్లు, ద్విచక్ర వాహనాలతో స్వాగతం పలికి భారీ ఊరేగింపుగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి తీసుకు వెళ్ళారు. ఈ సందర్భంగా వారిలో కొందరు జనసేన జెండాలు కూడా పట్టుకున్నారు.
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముందుగానే పట్టణంలో అల్లు అర్జున్ అభిమానులకు ఈ సమాచారం చేరవేయడంతో వేలాదిగా తరలివచ్చారు. అల్లు అర్జున్ కూడా ఆయనతో కలిసి వారికి అభివాదం చేశారు.
దీంతో ఆయన అల్లు అర్జున్ ద్వారా జనసేన ఓట్లను వైసీపికి మళ్లించుకునే ప్రయత్నం చేశారని టిడిపి అభ్యర్ధి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం, డీఎస్పీ, ఎస్పీ, సీఐ, ఎస్సైలను ఎన్నికల విధుల నుంచి తప్పించి వారిపై కేసులు నమోదు చేయాలని, శాఖాపరమైన చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని ఆదేశించింది. అలాగే అనుమతి లేకుండా పట్టణంలో ర్యాలీ నిర్వహించినందుకు అల్లు అర్జున్ మీద, అలాగే వైసీపి అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
మరోపక్క అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించి వైసీపి అభ్యర్ధి ఇంటికి వెళ్ళడాన్ని చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా తప్పు పట్టారు.