శనివారం సాయంత్రం 6 గంటలతో తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం పోలింగ్ జరుగబోతోంది. కనుక పోలింగ్ సజావుగా జరిగేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డిజిపి రవిగుప్తా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే...
శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసేవరకు రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ 144 అమలులో ఉంటుంది. హైదరాబాద్లోని డిజిపి కార్యాలయంలో సెంటరల్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు గాను 73,414 మంది పోలీసులు, 500 మంది స్పెషల్ పోలీసులు, 164 మంది కేంద్ర సాయుధ బలగాలు, తమిళనాడుకు చెందిన స్పెషల్ సాయుధ బలగాలు 3 కంపెనీలు, 7,000 మంది హోమ్ గార్డులు, మరో 2088 మంది ఇతర సిబ్బందిని మోహరించారు.
వీరు కాక మరో 1033 మంది వాహనాలు తనికీలు చేసేందుకు చెక్ పోస్టుల వద్ద, మొబైల్ స్క్వాడ్స్ నియమించబడ్డారు.
మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్న తనికీలలో రూ.94 కోట్లు నగదు, రూ.10 కోట్లు విలువైన మద్యం, రూ.7 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలు,రూ.11.48 కోట్లు విలువగల రకరకాల బహుమతులు, రూ.62.77 లక్షల విలువగల 91 కేజీల బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుంచి శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిద చట్టాలు, సెక్షన్స్ కింద 8,863 కేసులు నమోదు చేశామని, మొత్తం 34,526 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని డిజిపి రవిగుప్తా చెప్పారు.