ఈసారి లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి 12కి పైగా సీట్లు గెలుచుకుంటుందని కేసీఆర్ నమ్మకంగా చెపుతున్నారు. అందుకు బలమైన కారణం కూడా చెప్పారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగలిగింది కానీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చినందున వాటిని అమలుచేయలేకపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో కరెంట్ కష్టాలు, సాగుత్రాగు నీటి కష్టాలు మొదలైపోయాయి. కనుక అప్పుడే ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది.
శాసనసభ ఎన్నికలలో బీజేపీ 64 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. అదే ఆ పార్టీ పరిస్థితికి నిదర్శనం. కానీ లోక్‌సభ ఎన్నికలలో 10-12 సీట్లు గెలుచుంటామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది.
ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను, వాటి పరిపాలనను చూశారు. అలాగే మా బిఆర్ఎస్ ప్రభుత్వం పాలన చూశారు. బిఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రజలు గ్రహించారు. బిఆర్ఎస్ పార్టీకి 12కి పైగా సీట్లు వస్తాయి. కనుక కాంగ్రెస్, బీజేపీలకు సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయి,” అని కేసీఆర్ చెప్పారు.