లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వరుసగా కోర్టులలో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆమె రెండు బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో ఆమె ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు.
దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఈ కేసులో ఈడీని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ ఈ కేసుని మే 24కి వాయిదా వేసింది. ఆమె బయట ఉండి ఉంటే బిఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉండేవారు. కానీ ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
ఆమెపై ఈడీ తీవ్రమైన మనీ లాండరింగ్ కేసులో చార్జ్ షీట్ నమోదు చేయబోతోంది. ఈడీ, సీబీఐ రెండూ కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కనుక ఒకవేళ హైకోర్టు బెయిల్ మంజూరు చేయకపోతే కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇందుకు మరో 20-30 రోజులు సమయం పట్టవచ్చు. అంతవరకు కల్వకుంట్ల కవిత జైల్లో ఉండక తప్పకపోవచ్చు.