బెయిల్‌పై విడుదలైన మన్నే క్రిశాంక్

బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ శుక్రవారం సాయంత్రం బెయిల్‌పై చంచల్‌గూడా జైలు నుంచి బయటకు వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ వేసవి సెలవులకు మూసివేస్తున్నట్లు జారీ చేసిన సర్క్యులర్‌ను నాగేందర్ అనే విద్యార్ధి, క్రిశాంక్ కలిసి విద్యుత్ కోతలు, నీటి కొరత కారణంగా హాస్టల్స్ మూసి వేస్తున్నట్లు మార్చి నకిలీ సర్క్యులర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

దీని వలన యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిందంటూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిద్దరిపై మే 1వ తేదీన కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం జ్యూడిషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. క్రిశాంక్ వెంటనే బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో క్రిశాంక్ శుక్రవారం సాయంత్రం చంచల్‌గూడా జైలు నుంచి విడుదలయ్యారు. 

లోక్‌సభ ఎన్నికల సమయంలో తాను బిఆర్ఎస్ పార్టీ తరపున సోషల్ మీడియాలో ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించిందని క్రిశాంక్ ఆరోపించారు.