బిఆర్ఎస్‌కి మరో షాక్.. ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక రద్దు

లోక్‌సభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. అంతే కాదు... ఆయనకు రూ.50 వేలు జరిమానా కూడా విధించింది.

ఇంతకీ హైకోర్టు ఆయన ఎన్నిక ఎందుకు రద్దు చేసిందంటే, 2022లో ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్స్‌ వేశారు. కానీ ఆయన సంతకంతో దండె విఠల్ ఓ ఫోర్జరీ లేఖ సృష్టించి, నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. దాంతో దండె విఠల్ ఎన్నికైన్నట్లు ప్రకటించారు. 

ఈ విషయం తెలుసుకున్న పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి వెంటనే హైకోర్టులో కేసు వేశారు. దానిపై లోతుగా విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు దండె విఠల్  ఎన్నిక చెల్లదని, కనుక ఆయన ఎన్నికను (పదవి)ని రద్ధు చేస్తున్నట్లు సంచలన తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుపై దండె విఠల్ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

లోక్‌సభ ఎన్నికల సమయంలో వెలువడిన ఈ తీర్పుని కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేస్తే బిఆర్ఎస్ పార్టీకి ఇంకా నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది.