రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఓట్లు రాలుతాయా?

కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి జరిగే లోక్‌సభ ఎన్నికలలో జాతీయ అంశాలే ప్రధాన అజెండాగా ఉంటాయి. కనుక తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి రిజర్వేషన్ల అంశం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. గురువారం సిద్ధిపేట, కుత్బుల్లాపూర్‌, షాపూర్ నగర్‌ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశంపై మాట్లాడారు. అయితే దీంతో తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 

“నేను రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాపై కక్ష కట్టి ఢిల్లీలో నాపై కేసు నమోదు చేయించారు. ఆనాడు కేసీఆర్‌ కూడా నా మీద అనేక కేసులు పెట్టించి జైలుకి పంపితేనే భయపడలేదు. ఇప్పుడు ఢిల్లీ సుల్తానులకు భయపడతానా?

బీజేపీ, ఆర్‌ఎసెఎస్, బిఆర్ఎస్ మూడు కలిసి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు పెద్ద కుట్ర చేస్తున్నాయి. ఈసారి బీజేపీ 400 సీట్లు వస్తే పార్లమెంట్‌లో దానిని ఎవరూ అడ్డుకోలేరు. రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసేస్తుంది. 

మోడీ ప్రభుత్వం ఏదో విదంగా రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కూలద్రోసి తామే అధికారం చలాయించాలని తహతహలాడుతుంది తప్ప బడుగు బలహీన వర్గాలపై దానికి ఎటువంటి ప్రేమా లేదు. ఉండి ఉంటే దేశంలో పదేళ్ళకోసారి జరిగే జనగణన ఎందుకు జరిపించడం లేదు. 

జనగణన జరిపించి ఉంటే పెరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం వారికి రిజర్వేన్ల శాతం పెరిగి ఉండేది. అలా జరుగకూడదనే జనగణన కూడా నిలిపివేసింది. 

కానీ కాంగ్రెస్ పార్టీ జనగణనతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ జనగణన కూడా జరిపించి జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు పెంచాలని భావిస్తోంది. కనుక రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ కావాలా లేదా రిజర్వేషన్లను పెంచాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలా? ప్రజలే తేల్చుకోవాలి,” అని అన్నారు. 

ఈ ఎన్నికల కోసం సిఎం రేవంత్‌ రెడ్డి ఎంచుకున్న ఈ అంశం, ఈ వ్యూహం ఫలిస్తుందా?కనీసం రిజర్వేన్లతో సంబందం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైనా ఈ అంశంపై రేవంత్‌ రెడ్డి చేస్తున్న వాదనలను నమ్ముతారా?అంటే అనుమానమే. 

కానీ ఈ విషయంలో తనను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సిఎం రేవంత్‌ రెడ్డి మాటలతో ప్రజలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉండి. దాంతో తెలంగాణ సెంటిమెంట్ రగిలితే ఆ మేరకు ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.