తెలంగాణ గొంతుపై నిషేధమా? కేటీఆర్‌

బిఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ బుధవారం రాత్రి నుంచి 48 గంటలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. దీనిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. “ఇదెక్కడి అరాచకం? తెలంగాణ గొంతుపై నిషేధం విధిస్తారా? ప్రధాని నరేంద్రమోడీ, సిఎం రేవంత్‌ రెడ్డి ఇద్దరూ మా అధ్యక్షుడు కేసీఆర్‌ని ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడితే ఈసీకి వినబడలేదు. కానీ కేసీఆర్‌ చేసిన విమర్శలు మాత్రం నేరంగా కనిపించాయి. 

ఈ ఎన్నికలలో కుమ్మక్కు అయిన కాంగ్రెస్‌, బీజేపీలు మా పార్టీని, కేసీఆర్‌ని ఎదుర్కొలేకనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయి. కానీ కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా లోక్‌సభ ఎన్నికలలో గెలిచేది బిఆర్ఎస్ పార్టీయే. ప్రజలు కూడా కాంగ్రెస్‌, బీజేపీల కుట్రలు, మాయమాటలను నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలే ఆ రెండు పార్టీలకు తగినవిధంగా బుద్ధి చెపుతారు,“ అని కేటీఆర్‌ అన్నారు. 

అయితే ఈ పరిణామం కేటీఆర్‌కు కూడా ఓ హెచ్చరిక వంటిదే అని భావించవచ్చు. ఆయన కూడా హద్దులు దాటి మాట్లాడితే ఆయనపై కూడా ఎన్నికల సంఘం నిషేధం విధించే ప్రమాదం పొంచి ఉంది. కీలకమైన ఈ సమయంలో కేటీఆర్‌ చేజేతులా ఇటువంటి సమస్య తెచ్చుకోకుండా కాస్త ఆచితూచి మాట్లాడితే మంచిది. లేకుంటే బిఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం కలుగుతుంది.