కేసీఆర్‌కు జలక్ ఇచ్చిన ఎన్నికల సంఘం

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం జలక్ ఇచ్చింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 48 గంటలపాటు నిషేధం విధించింది.

ఆయన బుధవారం రాత్రి మహబూబాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఎన్నికల అధికారులు అక్కడకు చేరుకొని ఆయనకు నోటీస్ అందించి సంతకం తీసుకున్నారు. దాని ప్రకారం 48 గంటల పాటు కేసీఆర్‌ ఎన్నికల సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొనకూడదు. న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాతో సహా మరే ప్రసార మాధ్యమానికి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ఎటువంటి కామెంట్స్ పోస్ట్ చేయకూడదు.

నోటీస్ అందుకున్న కేసీఆర్‌ మద్యలోనే ఎన్నికల ప్రచారం ముగించుకొని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ మహబూబాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గంలోనిఓ బిఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యి ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించి దిశానిర్దేశం చేశారు. 

గత నెల 5వ తేదీన కేసీఆర్‌ సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిపై కాంగ్రెస్‌ నేతలు వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

అయితే కేసీఆర్‌ తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని పార్టీ, ప్రభుత్వ విధానాలనే విమర్శించానని, కానీ స్థానిక ఎన్నికల అధికారి, కాంగ్రెస్‌ నేతలు తన మాటలను వక్రీకరించారని ఎన్నికల సంఘానికి పంపిన సంజాయిషీలో పేర్కొన్నారు.

కేసీఆర్‌ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఎన్నికల సంఘం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా 48 గంటలు నిషేధం విధించింది. గతంలో కూడా కేసీఆర్‌ ఈవిదంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, అప్పుడూ అది సరికాదని సూచించామని ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులో పేర్కొంది.

ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకొని మరో వారం రోజులలో ముగియబోతుంటే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించడం బిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్‌ మళ్ళీ ప్రజల మద్యకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మొదలు పెట్టిన తర్వాతే బిఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది.