నాలుగు వారాల తర్వాత ఢిల్లీకి వస్తా: రేవంత్‌

రిజర్వేషన్ల విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను వక్రీకరించి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడినందుకు నేడు ఢిల్లీలోని ప్రత్యేక పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలంటూ సిఎం రేవంత్‌ రెడ్డికి ఈ నెల 29న నోటీస్ ఇచ్చారు.

కానీ తాను ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నందున నాలుగు వారాలు సమయం ఇవ్వాలంటూ సిఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పోలీసులను కోరుతూ జవాబు పంపించారు.

సిఎం రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ సోషల్ మీడియా ఇన్‌చార్జి మన్నే సతీష్, మరి కొందరు కాంగ్రెస్‌ నేతలకు ఢిల్లీ ప్రత్యేక పోలీసులు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు పంపారు. వారు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున నేడు విచారణకు హాజరుకాలేమని సమాధానం పంపారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లింల రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేసి వాటిని బడుగు బలహీన వర్గాలకు పంచేస్తామని చెప్పగా, సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సోషల్ మీడియా ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పూర్తిగా రిజర్వేషన్లు ఎత్తేస్తుందని చెప్పారని ఎన్నికల ప్రచారంలో చెపుతున్నారు. దీనిపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ, కేంద్ర హోమ్ శాఖ అధికారులు ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.