దిశ ఎన్‌కౌంటర్ కేసులో స్టే ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

దిశ సామూహిక హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచనం సృష్టించిందో, ఆ కేసులో నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం కూడా అంతే సంచనం సృష్టించింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 

వాటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమీషన్ లోతుగా విచారణ జరిపి ఇది భూటకపు ఎన్‌కౌంటరే అని నిర్దారిస్తూ దానితో సంబంధం ఉన్న ఏడుగురు పోలీసు అధికారులు, షాద్ నగర్‌ తహసిల్ధార్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందిగా సిఫార్సు చేసింది.  

కమీషన్ నివేదికపై అభ్యంతరం చెపుతూ వారు హైకోర్టుని ఆశ్రయించగా వారి పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం విచారణ పూర్తయ్యే వరకు వారిపై ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

టిఎస్‌ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్న విసి సజ్జనార్ కూడా ఈ ఎన్‌కౌంటర్ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున హైకోర్టు స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందో లేదో?