తెలంగాణకు వచ్చి నన్నే అవమానిస్తారా? రేవంత్‌

రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సిఎం రేవంత్‌ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలకు ఢిల్లీ స్పెషల్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సిఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈరోజు జగిత్యాల జిల్లా, కోరుట్ల సభలో ప్రసంగిస్తూ, “ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు రాష్ట్రానికి వస్తే నేను ఎంతో సాధరంగా ఆహ్వానించి సాగనంపాను. కానీ వారిరువురూ నా వినయాన్ని చాతకానితనంగా తీసుకొని చాలా చులకనగా మాట్లాడారు. 

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలను మాత్రమే తన ప్రత్యర్ధులపైకి పంపించేది. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా నాపైకి ఉసిగొల్పుతోంది. అయితే ఎన్నో కష్టానష్టాలను, సవాళ్ళను ఎదుర్కొనే నేను ఈ స్థాయికి వచ్చాను. కనుక ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు నేను భయపడను.  

రిజర్వేషన్లు లేకపోతే బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఉద్యోగాలు ఎలా లభిస్తాయి? కనుక రిజర్వేషన్లు కొనసాగించాలని నేను కోరినందుకే మోడీ, అమిత్ షాలు నాపై పగబట్టిన్నట్లు వ్యవహరిస్తున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన మోడీ, అమిత్ షాలు తెలంగాణ గడ్డపై నిలబడి ముఖ్యమంత్రినైన నన్నే అవమానిస్తున్నారు.

పదేళ్ళ మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. పసుపు బోర్డు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది. తెలంగాణకు ఏమీ చేయకపోయినా బీజేపీని గెలిపించాలని అడగటానికి సిగ్గు ఉండాలి,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.