తెలంగాణలో 17 సీట్లకు 525 మంది పోటీ!

తెలంగాణ రాష్ట్రంలో గల 17 ఎంపీ స్థానాలకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులతో కలిపి మొత్తం 525 మంది పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్‌రాజ్ మీడియాకు తెలియజేశారు. వీరిలో 285 మంది స్వతంత్ర అభ్యర్ధులు ఉన్నారని తెలిపారు. 

సికింద్రాబాద్‌ స్థానానికి అత్యధికంగా 45 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, ఆదిలాబాద్‌ స్థానానికి అత్యల్పంగా 12 మంది పోటీ పడుతున్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 3,986 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్ చెప్పారు.

ఈ శుక్రవారం నుంచే వయోవృద్ధులు, వికలాంగులకు ఇంటి నుంచి ఓట్లు వేసే ప్రక్రియ మొదలుపెట్టబోతున్నామని చెప్పారు. 

ఈ నెల 13న పోలింగ్‌ జరుగబోతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనబోయే ప్రభుత్వోద్యోగులు, ఉన్నతాధికారులకు తుది విడత శిక్షణ కార్యక్రమం కూడా పూర్తయింది. 

మే 11వ తేదీ సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుంది. కనుక మండే ఎండలను, వడగాడ్పులను కూడా లెక్కజేయకుండా అన్ని పార్టీల ముఖ్యనేతలు, వాటి అభ్యర్ధుల తరపున జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 

జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి వెంటవెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.