పవన్‌ కళ్యాణ్‌ ఇన్ని అప్పులు చేశారా?

జనసేన పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఏపీ శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దాని ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ తన వ్యక్తిగత అవసరాల కోసం తన అన్న మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖలతో సహా ఇంకా తన నిర్మాతలు, నిర్మాణ సంస్థల నుంచి మొత్తం రూ.46.70 కోట్లు అప్పులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

వారిలో అత్యధికంగా వీఆర్ విజయలక్ష్మి నుంచి రూ.8 కోట్లు,  హారిక అండ్ హాసినీ క్రియేషన్స్‌ రూ.6.35 కోట్లు, లీడ్ ఐ‌టి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.6 కోట్లు, తన వదిన కొణిదెల సురేఖ నుంచి రూ.2 కోట్లు అప్పులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ అనేక ఏళ్లుగా సినిమాలలో నటిస్తున్నారు. భారీ పారితోషికం అందుకుంటున్న నటులలో ఆయన కూడా ఒకరు. కనుక ఆయన అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏమిటి?అనే సందేహం కలుగవచ్చు, ఆయన ఏపీ రాజకీయాలలో చురుకుగా పనిచేస్తుండటంతో పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు చేయలేకపోతున్న సంగతి తెలిసిందే. కనుక సినిమాల ద్వారా తాను సంపాదించుకున్న సొమ్ములో చాలా వరకు జనసేన పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం ఖర్చు చేస్తుండటంతో ఆయన వద్ద బ్యాంక్ నిలువలు కరిగిపోయాయి. పార్టీకి విరాళాలు వస్తున్నప్పటికీ అవి ఎన్నికలకు ఏ మాత్రం సరిపోవు, కనుక తప్పనిసరి పరిస్థితులలో పవన్‌ కళ్యాణ్‌ తన బంధుమిత్రులు, సినీ నిర్మాతలు, సినీ నిర్మాణ సంస్థల వద్ద అప్పులు చేయక తప్పలేదు.