
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సెటిల్మెంట్స్ వ్యవహారంలో కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే కొత్త విషయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుతో బయటపడింది.
జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ 2011లో జూబ్లీహిల్స్‌లో ‘క్రియా హెల్త్ కేర్’ అనే సంస్థను స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్సు సర్వీసుల నిర్వహణ బాధ్యతలు చూసేవారు.
ఆయన సంస్థ శరవేగంగా అభివృద్ధి చెంది రూ.250 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆయన తన సంస్థను యూపీకి కూడా విస్తరించే ప్రయత్నాలలో బిజీగా ఉన్నప్పుడు, సంస్థ సీఈవో బాలాజీ, డైరెక్టర్లు గోపాల్, రాజ్, నవీన్, రవి కలిసి ఆ సంస్థను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకునేందుకు కుట్ర పన్నారు. సంస్థలోని చెన్నుపాటి వేణుమాధవ్ షేర్లు తమ పేరిట బదిలీ చేయించుకునేందుకు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్సై మల్లిఖార్జున రావు సాయం కోరారు.
2018, నవంబర్ 22వ తేదీన చెన్నుపాటి వేణుమాధవ్‌ని గచ్చిబౌలి నుంచి కిడ్నాప్ చేయించి సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకువచ్చి అక్కడ రెండు రోజులు నిర్బందించి వేధించారు. రాధాకిషన్ రావుతో సహా వారందరూ ఆయనను బెదిరించి సంస్థలోని షేర్లన్నీ తమ పేరిట బదిలీ చేయించుకున్నారు.
ఈ విషయం ఎవరికైనా చెప్పినా, మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తామని బెదిరించి వదిలేశారు. ఆ భయంతోనే ఇంతకాలం చెన్నుపాటి వేణుమాధవ్ మౌనంగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు అరెస్ట్ అవడంతో ధైర్యం చేసిన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాధాకిషన్ రావు, మిగిలినవారిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.