రేవంత్‌ చెడ్డీ గ్యాంగ్ లీడర్: హరీష్ రావు

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో అధికార, విపక్ష నేతల మాటలు పదునెక్కుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు నేడు పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మీరు రేవంత్‌ రెడ్డిని గెలిపిస్తే ఆయన కేసీఆర్‌ని నోటికి వచ్చిన్నట్లు తిడుతున్నారు. ఇందుకోసమేనా ఆయనను గెలిపించింది? కేసీఆర్‌ సాగునీరు, రైతుల సమస్యల గురించి అడిగితే, కేసీఆర్‌ చెడ్డీ ఊడదీసి పరిగెత్తిస్తానని రేవంత్‌ రెడ్డి చులకనగా మాట్లాడుతున్నారు. 

ఆయన మాటలు వింటుంటే ఆయన ముఖ్యమంత్రా లేక చెడ్డీ గ్యాంగ్ లీడరా? అని అనుమానం కలుగుతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు తియ్యతియ్యగా మాట్లాడినా రేవంత్‌ రెడ్డి ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు శాసనసభ ఎన్నికలలో అనేక అబద్దాలు చెప్పి ప్రజలను మాయ చేసి గెలిచారు. మళ్ళీ ఇప్పుడూ లోక్‌సభ ఎన్నికలలో అలాగే మాయమాటలు చెప్పి గెలవాలని ప్రయత్నిస్తున్నారు. 

కానీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ప్రజలకు ఎంతో సేవ చేశారు. తన సమర్ధత నిరూపించుకున్నారు. ఆయన ఇక్కడే ప్రజల మద్యనే ఉంటారు. కనుక ఆయనను గెలిపిస్తే పార్లమెంటులో తెలంగాణ ప్రజల గొంతు వినిపిస్తారు. మీ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారు,” అని హరీష్ రావు అన్నారు.