రేవంత్‌కి ఈటల 25 కోట్లు ఇచ్చారు: పాడి కౌశిక్

హుజూరాబాద్‌ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిఎం రేవంత్‌ రెడ్డి, బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌లపై సంచలన ఆరోపణ చేశారు. బిఆర్ఎస్ మల్కాజ్‌గిరి నియోజకవర్గం నేతలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో ఓడిపోయిన వ్యక్తి. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ మల్కాజ్‌గిరిలో చెల్లుతుందా?

ఈటల రాజేందర్‌ తన అక్రమాస్తులను కాపాడుకునేందుకే మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి సీటు ఖరారు కాగానే ముందుగా సిఎం రేవంత్‌ రెడ్డితో మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్ధి (పట్నం సునీతారెడ్డి)ని నిలబెట్టి తన గెలుపుకి సహకరించాలని, అందుకు ప్రతిగా రేవంత్‌ రెడ్డికి ఈటల రాజేందర్‌ రూ.25 కోట్లు ముట్టజెప్పారు. అందుకే హుజూరాబాద్‌ నుంచి ఇక్కడకు వచ్చి పోటీ చేస్తున్నారు. 

ఈటల రాజేందర్‌కు రెండుసార్లు మంత్రి పదవులు ఇచ్చి కేసీఆర్‌ ఎంతో గౌరవిస్తే, ఆయన కేసీఆర్‌కు, బిఆర్ఎస్ పార్టీని కూడా మోసం చేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు నీతి నిజాయితీ అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ మల్కాజ్‌గిరి ప్రజలకు ఆయన గురించి అంతా తెలుసు. కనుక వారే ఆయనకు గట్టిగా బుద్ధి చెపుతారు. 

మన పార్టీ అభ్యర్ధి రాగిడి లక్షారెడ్డి స్థానికుడు. మంచి విధ్యావంతుడు. కనుక ఆయనను ఎన్నుకుంటే తెలంగాణ ప్రజల తరపున లోక్‌సభలో గట్టిగా మాట్లాడుతారు,” అని అన్నారు.