కొడంగల్‌లో నాకు వ్యతిరేకంగా కుట్రలు: రేవంత్‌ రెడ్డి

కొడంగల్‌ సొంత నియోజకవర్గంలోనే తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని సిఎం రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మహబూబ్ నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి వంశీ చంద్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు కొడంగల్‌ వచ్చినప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి ఈ ఆరోపణలు చేశారు.

బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డికె అరుణ, బిఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి కొడంగల్‌లో తన ప్రతిష్టని దెబ్బ తీసి ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి అనుభవించిన డికె అరుణ జిల్లాకు ఏమి చేశారని ఇప్పుడు ఆమెకు ఓట్లు వేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 

కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసుకుంటే అభివృద్ధిని దెబ్బతీసుకున్నట్లే అవుతుందని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని సిఎం రేవంత్‌ రెడ్డి హితవు పలికారు. 

కొడంగల్‌ తన సొంత నియోజకవర్గం కనుకనే గతంలో ఎన్నడూ లేని విదంగా ఇప్పుడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయనే విషయం సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజలకు గుర్తుచేశారు. కొడంగల్‌లో ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, పశువైద్య కళాశాల వచ్చాయని త్వరలో సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతోందని చెప్పారు. 

నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పధకం ద్వారా జిల్లాలో ప్రతీ ఎకరానికి నీళ్ళు పారిస్తామని, సుమారు రూ.5,000 కోట్లు విలువగల అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. అవన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవ్వాలంటే కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి వంశీ చంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సిఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.