రాధాకిషన్ రావు రిమాండ్‌ మరో రెండు రోజులు పొడిగింపు

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు జ్యూడీషియల్ కస్టడీలో వారం రోజులుగా చంచల్‌గూడా జైల్లో ఉన్నారు. ఆయన కస్టడీ గడువు నేటితో ముగియడంతో చంచల్‌గూడా జైలు సిబ్బంది ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయన కస్టడీని మరో రెండు రోజులు అంటే ఏప్రిల్‌ 12వరకు పొడిగించింది. దీంతో జైలు సిబ్బంది మళ్ళీ ఆయనను చంచల్‌గూడా జైలుకి తరలించారు. 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఇంటలిజన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు చేసి ప్రశ్నించడంతో తీగ లాగితే డొంక కదిలిన్నట్లు పోలీస్ శాఖలో ఒకరొకరి పేర్లు బయటపడుతున్నాయి. ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న ఇంటలిజన్స్ మాజీ అధిపతి ప్రభాకర్ రావుని కూడా ప్రశ్నిస్తే, ఆనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల పేర్లు బయటపెట్టే అవకాశం ఉంది. అసలు కధ అప్పటి నుంచే మొదలవుతుంది. 

బహుశః లోక్‌సభ ఎన్నికలు ముగిసేలోగా ఈ వ్యవహారంలో రాజకీయ అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉంది.