
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్న గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో నేను ఒకడిని. కనుక పిసిసి అధ్యక్ష పదవి ఆశించడం తప్పు దురాశ కాదు. కనుక ఇదివరకు అడిగాను. ఇప్పుడూ అడుగుతున్నాను. ఇక ముందు అడుగుతూనే ఉంటాను. ఇప్పటికిప్పుడు కాకపోయినా లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిశాక మళ్ళీ అధిష్టానానికి ఓ సారి గుర్తు చేసి అడుగుతాను,” అని అన్నారు.
లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల గురించి మాట్లాడుతూ, “ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహ నిపుణుడునని చెప్పుకొంటూ బ్రతుకు తెరువు కోసం రోజుకో పార్టీతో పనిచేస్తూ ఏదేదో మాట్లాడుతుంటారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పాడు కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇపుడు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ గెలుస్తుందని చెపుతున్నాడు.
లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా రాహుల్ గాంధీయే మా పార్టీకి రాజు వంటివారు. గాంధీ కుటుంబం ఎప్పుడూ ప్రజలు, దేశం గురించే ఆరాటపడింది తప్ప మోడీ, అమిత్ షాల పదవీ అధికారం కోసం తాపత్రయపడలేదు. అందుకే నేటికీ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇంతగా అభిమానిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నాను,” అని జగ్గారెడ్డి అన్నారు