బిఆర్ఎస్‌ని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీగా మార్చేస్తాం

శాసనసభ ఎన్నికలలో ఓటమితో బిఆర్ఎస్ పార్టీలో అంతర్మధనం మొదలైంది. అయితే పార్టీ వైఖరి, విధానాలు, ముఖ్యంగా అధినేత, ముఖ్య నేతల తీరుపై ఆత్మవిమర్శ చేసుకొని అవసరమైన మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు సాగితే తప్పకుండా సత్ఫలితాలు కనిపిస్తాయి.

కానీ తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు, బిఆర్ఎస్ పేరుని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీగా మార్చాలనుకోవడం వంటి ఆలోచనలతో సత్ఫలితాలు ఆశిస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తు మార్పులు ఇప్పటికే జరుగుతున్నాయి. ఇప్పుడు పార్టీ పేరు మార్పుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాకు తెలిపారు. 

శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినప్పుడే పార్టీలో పలువురు నేతలు ఈ ప్రతిపాదన చేశారని, తెలంగాణ ఉద్యమాల కోసం పుట్టిన పార్టీ పేరులో నుంచి తెలంగాణను తొలగించడంతో ప్రజలు దూరమయ్యారని కొందరు నేతల వాదనలు సహేతుకంగా ఉన్నందున దీనిపై లోతుగా చర్చించి పార్టీ పేరుని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీగా మార్చేందుకు చట్ట, న్యాయ ప్రక్రియలు మొదలయ్యాయని, వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ పేరుతోనే పోటీ చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.