నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర సభ

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నుండు తుక్కుగూడలో ‘జనజాతర’ పేరుతో భారీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించబోతోంది. ఈ సభకు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యి ఎన్నికల మ్యానిఫెస్టోని విడుదల చేయనున్నారు. 

ఈ సభకు రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 50 వేల మంది చొప్పున 10 లక్షల మందిని జనసమీకరణ చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఎక్కువగా జనసమీకరణ చేయాలని సూచించిన్నట్లు తెలుస్తోంది. 

ఆరు గ్యారెంటీ పధకాలలో ఎక్కువ శాతం లబ్ధిదారులు మహిళలే ఉన్నారు. కనుక వారిని కూడా ఈ సభకు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

మరోపక్క మాజీ సిఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనలు చేస్తూ, సాగునీరు అందక ఎండిన పంటలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడుతూ, నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆనాటి సమైక్య రాష్ట్రంలోని దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని, కాంగ్రెస్‌ నేతలకు పాలన, నీటి నిర్వహణ చాతకాక రైతులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికల కోసమే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చి ఇంత ఎండల్లో రైతుల వద్దకు వెళుతున్నప్పటికీ, సాగు, త్రాగు నీరు, కరెంట్ సమస్యల గురించి ఆయన చెపుతున్నవన్నీ నిజాలే అని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ వాటిని రాజకీయ విమర్శలుగా, ఎన్నికల రాజకీయాలుగా కొట్టిపారేస్తోంది. 

అధికార, ప్రతిపక్షాలు లోక్‌సభ ఎన్నికల గురించే ఆలోచిస్తూ రాజకీయాలలో మునిగి తేలుతున్నాయి తప్ప రైతులు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కరించలేకపోతున్నారు.