బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్‌లోకి వలసలు... మొదలయ్యాయా?

మే 13న లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి సమయంలో నేతల ఫిరాయింపులు పార్టీలకు చాలా నష్టం కలిగిస్తాయి. అదే సమయంలో వారు చేరే పార్టీలు ఆ మేరకు లబ్ధి కలుగుతుంది.

ఇంతవరకు బిఆర్ఎస్ పార్టీ నుంచే కాంగ్రెస్‌, బీజేపీలలోకి వలసలు సాగాయి. ఇప్పుడు బీజేపీలో కూడా వలసలు మొదలయ్యాయి. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంపై మంచి పట్టున బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు.

శాసనసభ ఎన్నికలలో ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పటికీ లక్ష ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం గమనిస్తే నియోజకవర్గంపై ఆయనకు ఎంత  పట్టు ఉందో అర్దమవుతుంది. కనుక అటువంటి బలమైన నేత కాంగ్రెస్‌ పార్టీలో చేరడం వలన లోక్‌సభ ఎన్నికలలో మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు పెరుగుతాయి.  

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, సిఎం రేవంత్‌ రెడ్డిల సమక్షంలో ఆయన కండువా కప్పుకొని పార్టీలో చేరారు.

ఆయన మల్కాజ్‌గిరి లోక్‌సభ టికెట్‌ ఆశించగా బీజేపీ అధిష్టానం దానిని హుజూరాబాద్‌కు చెందిన ఈటల రాజేందర్‌కు కేటాయించడంతో కూన శ్రీశైలం‌గౌడ్ తీవ్ర అసంతృప్తి చెందారు. అప్పుడే బీజేపీనూయి వీడేందుకు నిర్ణయించుకోగా కాంగ్రెస్ నేతలు ఆయనతో మాట్లాడి పార్టీలోకి తెచ్చుకున్నారు. 

మల్కాజ్‌గిరిలో ఎంపీ అభ్యర్ధులుగా కాంగ్రెస్‌ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌, బిఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు.  

ఈ నెల 18న నాలుగవ విడత లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. పోలింగ్ మే 13, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: జూన్ 4.