ఆయన రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్‌ కూడా చేశారే!

తెలంగాణ టాస్క్ ఫోర్స్ మాజీ ప్రత్యేక అధికారి (ఓఎస్‌డి) రాధాకిషన్ రావు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయ్యారు. తాజాగా ఆయనపై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. స్థానిక వ్యాపారి ఎం.సుదర్శన్ కుమార్‌ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తాను 2019లో సనత్ నగర్‌లోని రాజేశ్వర కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థకు రూ.60 లక్షలు చెల్లించి జెకే కాలనీలో ఆ సంస్థ నిర్మించిన అపార్టుమెంటులో ఓ ఫ్లాట్ తన కూతురు పేరిట కొని దానిలో నివసిస్తున్నామని తెలిపారు. కానీ రెండు నెలల తర్వాత మరో 5 లక్షలు అదనంగా చెల్లించాలని లేకుంటే తక్షణం ఫ్లాట్ ఖాళీ చేయాలని ఆ సంస్థ యజమానులలో ఒకరైన ఎంవీకే విశ్వనాధ రాజు తనను ఫోన్లో బెదిరించారని తెలిపారు. 

కొన్ని రోజుల తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు తనను సికింద్రాబాద్‌లోని వారి కార్యాలయానికి తీసుకు వెళ్లారని చెప్పారు. అక్కడే తనను రెండు రోజులు నిర్బందించి తనను చిత్రహింసలు పెట్టారని పిర్యాదులో పేర్కొన్నారు. తక్షణం ఆ ఫ్లాట్ సేల్ డీడ్ రద్దు చేసుకొని విశ్వనాధ రాజుకి దానిని తిరిగి అప్పగించాల్సిందిగా ఓఎస్డీ రాధాకిషన్ తనను బెదిరించారని పిర్యాలో పేర్కొన్నారు. 

వారి చిత్రహింసలు, రాధాకిషన్ రావు బెదిరింపులు తట్టుకోలేక తన కూతురు పేర కొన్న ఆ ఫ్లాట్ సేల్ డీడ్ రద్దు చేసుకొని దానిని తిరిగి విశ్వనాధ రాజుకి అప్పగించేసి తాము ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లో ఉంటున్నామని సుదర్శన్ కుమార్‌ పిర్యాదులో పేర్కొన్నారు. 

ఇంతకాలం రాధాకిషన్‌ రావుకు భయపడి ఫిర్యాదు చేయలేదని, ఆయన ఇప్పుడు వేరే కేసులో అరెస్ట్ అవడంతో ధైర్యం చేసి ఫిర్యాదు చేశానని సుదర్శన్ కుమార్‌ చెప్పారు. కూకట్‌పల్లి పోలీసులు రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదు చేశారు. 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఎ-4గా ఉన్న రాధాకిషన్ రావు ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్నారు. నాంపల్లి కోర్టు అనుమతితో నేటి నుంచి వారం రోజులపాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రశ్నించనున్నారు.