ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందన్నట్లు మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి మాట్లాడగా, ఆయన స్పందిస్తూ ఆ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబందమూ లేదని ఖండించారు.
వారు ముగ్గురూ తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే లీగల్ నోటీస్ పంపిస్తానని కూడా కేటీఆర్ హెచ్చరించారు. కానీ వారు ముగ్గురూ స్పందించకపోవడంతో కేటీఆర్ వారికి లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేసినందుకు వారు ముగ్గురిపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ఆయన తరపున న్యాయవాది పేర్కొన్నారు.
లీగల్ నోటీసులు పంపించడంపై వారు ముగ్గురూ ఇంకా స్పందించవలసి ఉంది. ఇంతకీ మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో పలువురు హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేయించారు. నా భర్త కొండా మురళితో సహా రాష్ట్రంలో పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించారు,” అని ఆరోపించారు.
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా కేటీఆర్ తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిజిపి రవిగుప్తాకు పిర్యాదు చేయగా కాంగ్రెస్ సీనియర్ నేత కెకె మహేందర్ రెడ్డి నగర కమీషనర్‌గా కె శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
కనుక వారు ముగ్గురితో పాటు మరికొన్ని మీడియా సంస్థలకు కూడా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు.