ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలంగాణ అట్టుడికిపోతుంటే మాజీ ఐటి మంత్రి కేటీఆర్ నేడు మరో బాంబు పేల్చారు. ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “2022-23లో నాతో సహా అసదుద్దీన్ ఓవైసీ పలువురు ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. మా అందరి ఫోన్లు సర్వైలెన్సులో ఉన్నాయని హెచ్చరిస్తూ యాపిల్ ఫోన్ కంపెనీ మాకు మెసేజ్లు కూడా పంపింది.
దాని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో అప్పుడే పెట్టాను కావాలంటే చూసుకోండి. కనుక ఎవరు ఈ ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారు? తెలియాలంటే, ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించాలనే నేను కూడా కోరుతున్నాను.
ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి హయంలో కొందరు కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ఆరోపించారు. కనుక అప్పటి నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నిటిపై విచారణ జరిపించాలి.
ప్రభుత్వాలు మారుతాయి కానీ అధికారులు మారరు కదా?వారు అటూ ఇటూ బదిలీలు అవుతారు లేదా పదవీ విరమణ చేస్తుంటారు. కనుక ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి హయంలో చేసిన అధికారులే తర్వాత మా ప్రభుత్వంలో కూడా వేర్వేరు పదవులలో పని చేశారు. వారే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారు కూడా.
కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఒక్కరే నేరం చేశారన్నట్లు మీడియాకు లీకులు ఇవ్వడం కాదు. పదవీ విరమణ చేసి వెళ్ళిపోయిన అధికారులతో సహా అందరిపై విచారణ జరిపించి ఎవరెవరు ఈ వ్యవహారంలో ఉన్నారో తేల్చాలి,” అని కేటీఆర్ అన్నారు.
అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే అప్పుడు కేసీఆర్నే వేలెత్తి చూపాల్సి ఉంటుంది కదా? కాదంటే కేంద్ర ప్రభుత్వం తమ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందని కేటీఆర్ చెపుతున్నట్లనుకోవలసి ఉంటుంది. కానీ కేటీఆర్ మాటల ప్రకారం చూస్తే ఇది రాష్ట్ర స్థాయిలోనే జరిగిందని అర్దమవుతోంది. ఆ లెక్కన కేటీఆర్ కూడా ఈ వ్యవహారంలో తన తండ్రి కేసీఆర్ ప్రమేయం ఉందని చెపుతున్నట్లనిపిస్తుంది.
అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కిరణ్ కుమార్ రెడ్డి హయం నుంచే ప్రారంభమైందని కేటీఆర్ చెప్పడం మరో విశేషం.
అసమర్థ కాంగ్రెస్ పాలనలో..
తాగునీళ్ల కోసం ప్రజలు తల్లడిల్లుతుంటే..
సాగునీళ్ళు లేక రైతులు కన్నీళ్లు పెడుతుంటే..
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ట్యాపింగ్ పేరుతో టైమ్ పాస్ చేస్తున్న లీకువీరుడు రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥🔥 pic.twitter.com/754eapLIkX