సిద్ధిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద సుమారు 15 వేల ఎకరాలు సాగవుతున్నాయి. కానీ ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు వడిలిపోతున్నాయి.
కానీ జలాశయాలలో ఉన్న కొద్దిపాటి నీళ్ళు రాబోయే రోజుల్లో త్రాగునీటి అవసరాలకు పొదుపుగా వాడాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించడంతో, తక్షణం నీళ్ళు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని రైతులు అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.
దీంతో హరీష్ రావు పూనుకొని రైతులను, పార్టీ నేతలను వెంటపెట్టుకొని మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ను కలిసి నీటిని విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఒకవేళ 24 గంటల్లోగా నీళ్ళు విడుదల చేయకపోతే తానే మల్లన్నసాగర్ గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు.
హరీష్ రావు విజ్ఞప్తి, హెచ్చరికలపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ, మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 0.8 టీఎంసీలు నీళ్ళు విడుదల చేయించారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత కాలువలలో గోదావరి జలాలు ప్రవహిస్తుండటం చూసి రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో ఇంకా 9.02 టీఎంసీలు నీళ్ళు నిలువ ఉన్నాయి. వాటి నుంచి యాసంగి పంటలకు సరిపడా నీళ్ళు అందిస్తామని అధికారులు చెప్పారు.