బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నాలుగు జిల్లాలో పర్యటించి సాగునీరు లేక పంట నష్టపోతున్న రైతులను పరామర్శించిన తర్వాత సూర్యాపేటలో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “కేవలం మూడు నెలల్లోనే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుండటంతో కేసీఆర్ తీవ్ర ఆందోళనతో ఉన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఈవిదంగా జరుగుతుండటంతో ఈసారి ఒక్క సీటు కూడా గేలిచే అవకాశం లేదని కేసీఆర్కు తెలుసు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్తో సహా పలువురు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. కనుక కేసీఆర్ చాలా ఆందోళనతో ఉన్నారు. అందుకే మతి భ్రమించిన్నట్లు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు.
ఈ మూడు నెలల్లోనే రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ పచ్చి అబద్దాలు చెపుతూ, రైతులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు క్రుంగిపోయిన్నట్లు తెలుసుకొని బ్యారేజీలో నిలువచేసిన నీటినంతా కిందకు వదిలేశారు.
2023, జూలై 2న సాగునీటి శాఖ అధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడే, పంటలకు నీరు నీలిపివేసి త్రాగునీరు అందించాలని ఆదేశించిన మాట వాస్తవమా కాదా? ఆయనే చెప్పాలి. అప్పుడే బ్యారేజీలో నీళ్ళు లేకపోతే ఇప్పుడు ఎలా వస్తాయి?
వేలకోట్లు ఖర్చు చేసి నిర్మించిన మిషన్ భగీరధతో ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పుకునేవారు. అదే నిజమనుకుంటే మరిప్పుడు త్రాగునీళ్ళు ఎందుకు లేకుండా పోయాయి?” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరధ ప్రాజెక్టులు తాను కట్టించి ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వలన వాటిని ఉపయోగించుకొని సాగు, త్రాగు నీరు అందించలేక పోతోందని మొన్న కేసీఆర్ విమర్శిస్తే, వాటి గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈవిదంగా ఎదురు ప్రశ్నించడం చాలా ఆసక్తికరంగా ఉంది కదా?