మూడు నెలల్లోనే తెలంగాణ పరిస్థితి ఇలా మారుతుందనుకోలేదు: కేసీఆర్‌

మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ఈరోజు నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాలలో సాగునీరు అందక ఎండిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో సరిపడంతా కరెంటు, నీళ్ళు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతకానితనం వలన ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

పదేళ్ళపాటు కోతలు లేకుండా 24 గంటలు కరెంటు సరఫరా చేశాము. గత 8 ఏళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు కావలసినంత నీళ్ళు ఇచ్చాము. ఎక్కడా ఒక ఎకరా కూడా ఎండిపోనీయకుండా రైతులను కాపాడుకున్నాము. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతకానితనం వలన అప్పుడే చేతులెత్తేసింది. మూడు నెలల్లోనే తెలంగాణలో ఇటువంటి దయనీయ పరిస్థితులు ఏర్పడుతాయని నేను ఊహించలేదు.

 ధాన్యం ఉత్పత్తిలో  యావత్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణలో నేడు రైతులు సాగునీరు లేక పంటలు ఎండబెట్టుకోవడం చూస్తే మనసంతా బాధ కలుగుతోంది. వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టదు. 

ఎందుకంటే కాంగ్రెస్ నేతలకు ఎంతసేపు మా పార్టీ నేతలని ఎత్తుకుపోవాలనే ఆలోచనే తప్ప రైతుల కష్టాలు పట్టవు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎత్తుకుపోయి మా పని అయిపోయిందంటూ మాట్లాడటం చిల్లర రాజకీయాలే. ముందు రైతులకు నీళ్ళు, ప్రజలకు కరెంట్ అందించి తర్వాత మాట్లాడితే బాగుంటుంది. 

మిషన్ భగీరధతో ఇంటింటికీ నల్లా నీళ్ళు అందించాము. కానీ ఇప్పుడు ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం రోడ్ల మీదకి రావలసి వస్తోంది. యావత్ దేశం మెచ్చుకున్న మిషన్ భగీరధ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతిలో ఉండగా ఆడబిడ్డలకు నీళ్ళు అందించకుండా ఎందుకు కష్టపెడుతున్నారు?

రైతులకు బాసటగా బిఆర్ఎస్ పార్టీ నిలిచి పోరాడుతుంది. కనుక రైతులు ధైర్యం కోల్పోవద్దు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కేసీఆర్‌ అన్నారు.