హైదరాబాద్‌లో ఓవైసీని ఓడించగల వారెవరు?

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌  ఓవైసీని ఈసారి ఓడించాలని చాలా పట్టుదలగా ఉన్న బీజేపీ ఈసారి లోక్‌సభ ఎన్నికలలో హైదరాబాద్‌ నుంచి ప్రముఖ సామాజికవేత్త, హిందూ ప్రచారకురాలు మాధవీలతని అభ్యర్ధిగా ప్రకటించింది. పాతబస్తీకే చెందిన ఆమెకు ఆ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో మంచి పరిచయాలున్నాయి. కనుక ఆమె అసదుద్దీన్‌  ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 

ఇంతవరకు బిఆర్ఎస్‌, మజ్లీస్ మిత్రపక్షాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు మజ్లీస్‌ పార్టీ కాంగ్రెస్‌కు దగ్గరవుతోంది. కనుక బిఆర్ఎస్‌ పార్టీ ఈసారి హైదరాబాద్‌ నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ని అభ్యర్ధిగా ప్రకటించింది. బిఆర్ఎస్‌ పార్టీ హైదరాబాద్‌లో అభ్యర్ధిని నిలబెట్టినప్పటికీ, కల్వకుంట్ల కవిత అరెస్ట్ నేపధ్యంలో ఈసారి బీజేపీ అభ్యర్ధి మాధవీలత గెలుపుకి లోపాయికారిగా తోడ్పడే అవకాశం ఉంది.  

 కాంగ్రెస్ పార్టీ ఇంకా హైదరాబాద్‌కు అభ్యర్ధిని ప్రకటించలేదు. కానీ మజ్లీస్‌ దగ్గరైనందున అక్కడ నుంచి బలహీనమైన అభ్యర్ధిని పోటీలో నిలిపి అసదుద్దీన్‌  ఓవైసీకు పరోక్షంగా సహకరించే అవకాశం ఉంది. 

ఈ నేపద్యంలో చూస్తే ఈసారి హైదరాబాద్‌ నియోజకవర్గంలో మజ్లీస్‌, కాంగ్రెస్‌ ఒకవైపు, బీజేపీ, బిఆర్ఎస్‌ మరోవైపు ఉండబోతున్నట్లు భావించవచ్చు. కనుక పోటీ ప్రధానంగా అసదుద్దీన్‌  ఓవైసీ, మాధవీలతల మద్యనే ఉండబోతోంది. కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌ పార్టీలు మూడు, నాలుగు స్థానాలకే పరిమితం కావచ్చు.