ఇద్దరు ఎస్పీలకు రిమాండ్‌... చంచల్‌గూడా జైలుకి తరలింపు

ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో అరెస్ట్ అయిన జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్నలను పోలీసులు ఆదివారం ఉదయం కొంపల్లిలో న్యాయమూర్తి నివాసానికి తీసుకువెళ్ళి  హాజరుపరచగా వారికి ఏప్రిల్‌ 6వరకు 14 జ్యూడిషియల్ రిమాండ్‌ విధించారు. పోలీసులు ఇద్దరు పోలీస్ అధికారులను చంచల్‌గూడా జైలుకి తరలించారు. 

ఈ కేసులో అరెస్ట్ అయిన ఇంటలిజన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకి ఈ నెల 28వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించడంతో ఆయన కూడా ప్రస్తుతం చంచల్‌గూడా జైలులోనే ఉన్నారు. ఈ కేసులో భుజంగరావు, తిరుపతన్నల మీద పోలీసులు ఐపీసీ సెక్షన్ 120a, 409, 427, 201, మరియు సెక్షన్ 3లోని 34 కింద కేసులు నమోదు చేశారు. 

ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరుని పోలీసులు ఏ1గా, ప్రణీత్ రావు-ఏ2గా, హైదరాబాద్‌ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు-ఏ3, భుజంగరావు-ఏ4, తిరుపతన్న-ఏ5, ఐన్యూస్ మీడియాకు చెందిన అరువెల శ్రవణ్ రావు పేరుని ఏ6గా చేర్చారు. వారి ఇళ్ళలో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు ఇద్దరికీ నోటీసులు అందజేసి విచారణకు హాజరు కావలసిందిగా కోరారు.  

మునుగోడు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, ఆ సమాచారంతో వారిని బెదిరించడం, ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీకి చెందిన నగదును తమ పోలీస్ వాహనాలలో నియోజకవర్గాలకు తరలించడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం తదితర నేరాల క్రింద వారిని అరెస్ట్ చేశారు.

ప్రణీత్ రావుని విచారించినప్పుడు, తాను రేవంత్‌ రెడ్డి నివాసానికి 1-2 కిమీ దూరంలో గల ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో గది అద్దెకు తీసుకొని అక్కడి నుంచే రేవంత్‌ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేసేవారిమని బయటపెట్టారు.