ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటున్న ఆమె భర్త అనిల్ కుమార్ సోదరి అఖిల ఇంట్లో సోదాలు చేసిన సంగతి తెలిసిందే. నేడు నిజామాబాద్‌లో కూడా కల్వకుంట్ల కవిత బంధువులు, ఆమె భర్తతో వ్యాపార లావాదేవీలు కలిగినవారి ఇళ్ళలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఈడీ మరో కొత్త పేరు బయటపెట్టింది. అతనే కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్. ఈ కేసులో అతనికి కూడా సంబంధం ఉన్నట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
కోర్టుకు సమర్పించిన రిమాండ్ లెటర్లో మేక శరణ్ పేరును కూడా ప్రస్తావిస్తూ, కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలు చేసినప్పుడు అతని మొబైల్ ఫోన్ కూడా దొరికిందని, దానిలో డేటాని పరిశీలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబందించిన కొన్ని వివరాలు కనిపించాయని ఈడీ అధికారులు రిమాండ్ లెటర్లో పేర్కొన్నారు.
కనుక అతనికి నోటీస్ పంపించి విచారణకు రమ్మనమని రెండుసార్లు పిలిస్తే రాలేదని దానిలో పేర్కొన్నారు. ప్రస్తుతం మేక శరణ్ ఎక్కడ ఉన్నారో తెలీదు. ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది.