తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మాజీ ఇంటలిజన్స్ డీఎస్పీ ప్రణీత్ రావుని అరెస్ట్ చేసి ప్రశ్నించగా ఆయన చెప్పిన విషయాల ఆధారంగా జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని, సీ.ఎస్.డబ్ల్యూ అదనపు ఎస్పీ తిరుపతన్నని పోలీసులు అరెస్ట్ చేశారు.
మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలలో వారిరువురి వాహనాలలోనే నియోజకవర్గాలకు డబ్బు తరలించిన్నట్లు విచారణలో బయటపడింది. దీంతో పోలీసులు వారిరువురినీ నిన్న అరెస్ట్ చేసి, నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇక మరో సంచలన విషయం కూడా బయటపడింది. ఈ కేసులో ప్రణీత్ రావు, అతని బృందం ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఓ కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు తీసుకొని అక్కడి నుంచి రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, బంధువుల ఫోన్లు ట్యాపింగ్ చేసేవారనే కొత్త విషయం బయటపడింది.
ఇది వరకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా సార్లు బిఆర్ఎస్ పార్టీకి పోలీస్ ఉన్నతాధికారులు డబ్బు తరలింపులో సాయపడుతున్నారని ఆరోపించేవారు. ఇప్పుడు అది నిజమని తేలింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే పెద్ద నేరం కాగా, పోలీస్ అధికారుల వాహనాలలో ఎన్నికలకు డబ్బు తరలించడం మరో పెద్ద నేరం. తీగ లాగితే డొంక కదిలిన్నట్లు అరెస్ట్ అయిన వారిరువురూ ఈ వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు బయట పెడితే, కేసీఆర్కు కొత్త కష్టాలు మొదలవడం ఖాయం.