తుక్కుగూడాలో కాంగ్రెస్‌ సభకు రాహుల్ గాంధీ

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడినందున, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇంకా పలువురు జాతీయ స్థాయి కాంగ్రెస్‌ నాయకులు హాజరుకాబోతున్నారు. ఈ సభలోనే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోని విడుదల చేయనున్నారు. 

శాసనసభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడటంతో ఈసారి లోక్‌సభ ఎన్నికలలో 17కి కనీసం 10-12 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని సిఎం రేవంత్‌ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు.

అయితే శాసనసభ ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలినందున, గ్రేటర్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షిస్తూ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొంటున్నారు. ఇటీవలే రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ బంజారాహిల్స్‌లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు.

కానీ ఆమె పార్టీలో చేరుతున్నట్లు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆమె చేరితే ఆమెతో పాటు పలువురు బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశం ఉంటుంది కనుక ఈసారి లోక్‌సభ ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో కూడా మెజార్టీ సీట్లను దక్కించుకోవచ్చని సిఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు.