కల్వకుంట్ల కవిత భర్త బంధువుల ఇళ్ళలో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఈడీ కస్టడీల గురించి అందరికీ తెలుసు. ఇదే కేసులో ఆమె భర్త అనిల్‌ కుమార్‌కు కూడా నోటీస్ ఇవ్వడంతో శనివారం హైదరాబాద్‌లోని ఆయన సోదరి అఖిల నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత చెప్పిన విషయాలు, ఆమె కాల్ డేటా ఆధారంగా అనిల్ కుమార్‌ బంధువుల ఇళ్ళలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కల్వకుంట్ల కవిత కస్టడీ ముగుస్తుంది. కనుక అధికారులు మరికొద్ది సేపటిలో మళ్ళీ ఆమెను ఢిల్లీ హైకోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇదే కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ని కూడా కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నందున, ఇద్దరినీ కలిపి ప్రశ్నించేందుకు గాను మరో వారం రోజుల పాటు కల్వకుంట్ల కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది.