బిఆర్ఎస్‌ నుంచి మరో నేత కాంగ్రెస్‌లోకి జంప్!

బిఆర్ఎస్ పార్టీకి ప్రతీరోజు షాకులు తగులుతూనే ఉన్నాయి. రోజుకో ముఖ్య నేత పార్టీకి వీడి కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి గురువారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సిఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

జిల్లా నుంచి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ జిల్లాలోని కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం చెపుతుండటంతో చేరలేకపోయారు. సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి సీతక్క ఇద్దరూ స్థానిక కాంగ్రెస్‌ నేతలకు నచ్చజెప్పి ఇంద్రకరణ్ రెడ్డిని కూడా చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలలో ఆదిలాబాద్‌ నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా ఆత్రం సక్కు పేరుని కేసీఆర్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఎన్నికలకు ముందే జిల్లాలో పార్టీ ఖాళీ అయిపోతుండటం కేసీఆర్‌కు చాలా ఆందోళనకరంగా మారింది.