ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన తెలంగాణ ఇంటలిజన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినా పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో ఉన్న తనను 12 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారని, ఈ కేసు గురించి మీడియాకు పోలీసులు లీకులు ఇస్తున్నారని, పోలీస్ స్టేషన్లో పడుకునేందుకు సరైన సౌకర్యం కల్పించలేదని, తన బంధువులతో మాట్లాడేందుకు అనుమతించడం లేదంటూ ప్రణీత్ రావు తన పిటిషన్ ద్వారా హైకోర్టుకి చాలా పిర్యాదులే చేశారు.
కానీ ప్రభుత్వం వాదించిన న్యాయవాది ఆయన చేసిన ప్రతీ ఆరోపణకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి, ఈ కేసులో ఆయనను ప్రశ్నిస్తున్నప్పుడు, కోర్టులో పిటిషన్ వేసి విచారణను అడ్డుకోవాలని ప్రయత్నించడం సరికాదని వాదించారు.
ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ప్రణీత్ రావు పిటిషన్ని కొట్టి వేస్తున్నట్లు గురువారం ఉదయం ప్రకటించింది. దీంతో ప్రణీత్ రావు మరో మూడు రోజులపాటు పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొనక తప్పదు.