తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలు కూడా మళ్ళీ సచివాలయంలోకి వెళ్ళి అధికారులను, మంత్రులను కలుసుకోగలుగుతున్నారు. కానీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున, సామాన్య ప్రజలను లోనికి అనుమతించడం లేదు.
ఏదైనా పెండింగ్ సమస్యలు ఉన్నట్లయితే ఆయా శాఖలలో అధికారులు లేదా ఉద్యోగులను కలిసేందుకు అవకాశం ఉంది కానీ మంత్రుల చాంబర్లకు వెళ్ళేందుకు అనుమతించడం లేదు.
ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు మంత్రులు కొత్తగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు కనుక ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఈ నిషేదం అమలులో ఉంటుందని సచివాలయ నిర్వహణ అధికారులు తెలిపారు.
అలాగే ఎన్నికల కోడ్ కారణంగానే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పారు.