తెలంగాణలో మే 13న జరుగబోయే లోక్సభ ఎన్నికలలో 17 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తామని సీపీఎం పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా భువనగిరి నియోజకవర్గానికి అభ్యర్ధిగా జహంగీర్ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వీరయ్య ప్రకటించారు. త్వరలోనే మిగిలిన 16 స్థానాలకు కూడా అభ్యర్ధులను ప్రకటిస్తామని తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ అభ్యర్ధన మేరకు సీపీఐ, సీపీఎం పార్టీలు బిఆర్ఎస్ పార్టీతో పొత్తుకి అంగీకరించి ఆ పార్టీకి మద్దతు ప్రకటించడంతో విజయం సాధించింది.
కనుక శాసనసభ, లోక్సభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీతో పొత్తులు కొనసాగుతాయని అవి భావించి కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తుండగా, వాటిని పట్టించుకోకుండా బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాని ప్రకటించి షాక్ ఇచ్చారు.
ఆ తర్వాత సీపీఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని, కొత్తగూడెం నుంచి ఒక సీటు (రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు) గెలుచుకోగలిగింది. సీపీఎం మాత్రం అప్పుడు శాసనసభ ఎన్నికలలో, ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో కూడా ఒంటరిగానే ముందుకు సాగుతోంది.