తెలంగాణ గవర్నర్‌గా సీపి రాధాకృష్ణన్ బుధవారం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేస్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇంతకాలం తెలంగాణ గవర్నర్‌గా వ్యవహరించిన తమిళిసై మళ్ళీ బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు తన పదవికి రాజీనామా చేయడంతో, ప్రస్తుతం ఝాఖండ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సీపి రాధాకృష్ణన్‌కు తెలంగాణ, పుదుచ్చేరి అధనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
తమిళిసైలాగే గవర్నర్ సీపి రాధాకృష్ణన్ కూడా తమిళనాడుకు చెందినవారే. గతంలో కోయంబత్తూరు నుంచి రెండు సార్లు బీజేపీ ఎంపీగా ఉన్నారు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్‌గా చేసిన ఈఎస్ఎల్ నరసింహన్ కూడా తమిళనాడుకు చెందినవారే. తమిళనాడుకు చెందిన ముగ్గురు ప్రముఖులు వరుసగా తెలంగాణకు గవర్నర్లుగా నియమితులవడం విశేషమే.
తెలంగాణ, పుదుచ్చేరిలకు పూర్తి స్థాయి గవర్నర్లు నియమింపబడే వరకు సీపి రాధాకృష్ణన్ గవర్నర్‌గా వ్యవహరించనున్నారు.