బీజేపీ కండువా కప్పుకున్న తమిళిసై

తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ పదవులకు రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం చెన్నైలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరియు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. 

ఆమె 20 ఏళ్ళపాటు బీజేపీలోనే ఉన్నారు. 2019లో తెలంగాణ గవర్నర్‌ పదవి చేపట్టే ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోడీ అనుమతి తీసుకొని గవర్నర్‌ పదవులకు రాజీనామా చేశారు.

మళ్ళీ 5 ఏళ్ళ విరామం తర్వాత బీజేపీలో చేరడం తనకు చాలా ఆనందం కలిగిస్తోందని తమిళిసై అన్నారు. గవర్నర్‌గా తనకు చాలా సౌకర్యాలు, గౌరవం లభిస్తున్నప్పటికీ వాటన్నిటినీ వదులుకొని బీజేపీలోకి తిరిగి వచ్చానని తమిళిసై అన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులో బీజేపీ కమలం తప్పకుండా వికసిస్తుందని నమ్మకం తనకు ఉందన్నారు. 

గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా, ఆమె గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆమె గవర్నర్‌గా కాక పక్కా బీజేపీ నేతలాగా వ్యవహరిస్తున్నారంటూ బిఆర్ఎస్‌  మంత్రులు విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు ఆమె కాషాయ కండువా కప్పుకొని పక్కా బీజేపీ నేతగా మారారు.