తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తన పదవికి రాజీనామా చేయడంతో, ఆమె స్థానంలో మరో గవర్నర్‌ని నియమించే వరకు ఝార్ఖండ్ గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌కు తెలంగాణ, పుదుచ్చేరి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని తెలియజేసింది. తెలంగాణ, పుదుచ్చేరిలకు పూర్తిస్థాయి గవర్నర్ల నియామకం జరిగే వరకు ఆయనే ఇన్‌ఛార్జి గవర్నర్‌గా వ్యవహరిస్తారని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. 

గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వ్యవహరించిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఈసారి లోక్‌సభ ఎన్నికలలో తన స్వరాష్ట్రమైన తమిళనాడు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకే తన రెండు పదవులకు రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అనుమతితో తన పదవులకు రాజీనామా చేశారు కనుక ఆమెకు బీజేపీ టికెట్‌ ఖాయమే అని భావించవచ్చు.

గత ఎన్నికలలో ఆమె తూత్తుకూడి నుంచి పోటీ చేసి డిఎంకె అభ్యర్ధి కనిమోళి చేతిలో ఓడిపోయారు.

కానీ 5 ఏళ్ళుగా తమిళనాడుకు దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్న కారణంగా ఆమె తన నియోజకవర్గంపై పట్టు కోల్పోయి ఉంటారు. కనుక టికెట్‌ లభించినా ఆమె ఎన్నికలలో గెలుస్తారో లేదో?