లిక్కర్ స్కామ్‌లో కవితది కీలకపాత్ర: ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీలో ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మొన్న ఆదివారం ఈడీ మీడియాకు ఓ ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. ఈ కేసులో కల్వకుంట్ల కవిత కీలకపాత్ర పోషించారని స్పష్టంగా దానిలో పేర్కొంది. 

తాము ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా 245 ప్రాంతాలలో సోదాలు నిర్వహించి, ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసి వారి ద్వారా పూర్తి వివరాలు సేకరించామని ప్రెస్‌నోట్‌లో ఈడీ తెలియజేసింది. 

ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ 2021-22ని తమకు అనుకూలంగా రూపొందించేందుకు కల్వకుంట్ల కవిత తదితరులు రూ.100 కోట్లు ఆమాద్మీ ప్రభుత్వంలోని పెద్దలకు చెల్లించడంతో వారు కోరుకున్నట్లుగానే పాలసీని ప్రకటించిందని ఈడీ పేర్కొంది. దాని ద్వారా కల్వకుంట్ల కవిత తదితరులకు చెందిన మద్యం కంపెనీలు, మద్యం వ్యాపారులు భారీగా లాభాలు ఆర్జించుకునేందుకు వెసులుబాటు కలిగిందని ఈడీ పేర్కొంది. 

ఈ దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సోదాలు చేసినప్పుడు సంబందిత వ్యక్తులు, సంస్థల నుంచి రూ.128.79 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. కనుక ఈ కేసులో కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయని, అందుకే మార్చి 15వ తేదీన ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశామని, ప్రస్తుతం ఆమె తమ కస్టడీలోనే ఉన్నారని ఈడీ ప్రెస్‌నోట్‌లో పేర్కొంది.