బిఆర్ఎస్‌కి మరో షాక్... చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి జంప్!

శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఓడిపోయిన తర్వాత పార్టీ నుంచి ఇంత త్వరగా వలసలు మొదలైపోతాయని కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతీరోజు ఒకరిద్దరు ఎంపీలు, సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరిపోతూనే ఉన్నారు. 

ఈరోజు వరంగల్‌ జిల్లా బిఆర్ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసిన్నట్లు ప్రకటించారు. త్వరలో అయాన్ బీజేపీలో చేరి వరంగల్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నారు. 

ఈరోజే చేవెళ్ళ బిఆర్ఎస్‌ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను పార్టీని వీడుతున్నానని, తనకు ఎంపీగా చేవెళ్ళ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌, కేటీఆర్‌లకు రంజిత్ రెడ్డి తన రాజీనామా లేఖలో ధన్యవాదాలు తెలుపుకున్నారు. రంజిత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 

బిఆర్ఎస్‌ పార్టీలో ఇంకా చాలా మంది సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారు. వారిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంకా పలువురు ఉన్నారు. హరీష్ రావు కూడా పార్టీ వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వాటిపై ఆయన స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.