బుజ్జగింపులతో తగ్గేదేలే... ఆరూరి రమేష్ రాజీనామా!

వరంగల్‌ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. దానిలో తన పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆయన వరంగల్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకున్నారు. కానీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తెకు టికెట్‌ ఇవ్వకపోతే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతానని సంకేతాలు ఇవ్వడంతో, కేసీఆర్‌ ఆరూరి రమేష్ ని కాదని కడియం కుమార్తె డా.కావ్యకు టికెట్‌ ఇచ్చారు. 

దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దపడగా బీజేపీలో చేరితే వరంగల్‌ టికెట్‌ ఇస్తామని ఆయనకు ఆఫర్ ఇచ్చింది. దాంతో ఆయన బీజేపీలో చేరేందుకు సిద్దపడి, మూడు రోజుల క్రితం ఆయన హన్మకొండలో తన నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అనుచరుల సమక్షంలో ప్రకటన చేయబోయారు. 

కానీ అదే సమయంలో అక్కడకు చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనను బుజ్జగించి కారులో హైదరాబాద్‌ తీసుకువెళ్ళి హరీష్ రావుతో సమావేశపరిచారు. ఆ తర్వాత ఆరూరి రమేష్ “నేను పార్టీలోనే ఉన్నాను. ఉంటాను,” అని చెప్పారు. 

కానీ వరంగల్‌ తిరిగి రాగానే మళ్ళీ అనుచరులతో సమావేశమై చర్చించి, బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కోసమే బీజేపీ వరంగల్‌ అభ్యర్ధిని ప్రకటించకుండా పెండింగులో పెట్టింది కనుక నేడో రేపో ఆయన బీజేపీలో చేరగానే ఆయనకు టికెట్‌ ఖరారు చేసే అవకాశం ఉంది.