ఇటీవల బిఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మృతితో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగబోతోంది. కేంద్ర ఎన్నికల కమీషన్ నిన్న ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్లో దేశవ్యాప్తంగా 26 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి మే 13వ తేదీన ఉప ఎన్నిక జరుగబోతోంది.
లాస్య నందిత ఆకస్మిక మరణ విషాదం నుంచి ఆమె కుటుంబం సభ్యులు క్రమంగా కోలుకుంటున్నారు. ఆమె చెల్లెలు లాస్య నివేదిత నిన్న మీడియాతో మాట్లాడుతూ, “మా అక్క స్థానంలో నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకుంటున్నాను. త్వరలోనే మా బిఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసి నాకు ఈ టికెట్ కేటాయించవలసిందిగా కోరుతాను. నాకే తప్పకుండా ఇస్తారనే నమ్మకం ఉంది. ఒకవేళ నేను పోటీ చేసేందుకు బిఆర్ఎస్ అధిష్టానం అనుమతిస్తే, పార్టీలకు అతీతంగా అందరూ నాకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగనున్నాయి. వాటి షెడ్యూల్:
ఎన్నికల నోటిఫికేషన్: ఏప్రిల్ 18; నామినేషన్స్ గడువు: ఏప్రిల్ 25; నామినేషన్స్ పరిశీలన: ఏప్రిల్ 26, నామినేషన్స్ ఉపసంహరణ: ఏప్రిల్ 29; పోలింగ్: మే: 13, ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి: జూన్ 6వ తేదీ.