ఈడీ కస్టడీలో కల్వకుంట్ల కవిత... భర్తకు కూడా నోటీసులు!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈ కేసులో ప్రశ్నించేందుకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆమెను తిరిగి కోర్టులో హాజరు పరచవలసిందిగా కోర్టు ఈడీని ఆదేశించింది. 

ఇదే కేసులో ఆమె భర్త అనిల్, ఆమె సిబ్బందిలో మరో ముగ్గురుకి ఈడీ నోటీస్ జారీ చేసి విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశించడం మరో తాజా పరిణామమే.

సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగా ఈడీ ఆమెను అరెస్ట్ చేయడం సరికాదంటూ ఆమె తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి న్యాయస్థానంలో ఎంతగా వాదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

సుప్రీంకోర్టు తీర్పుకి వక్ర భాష్యాలు చెప్పుకొని, మీడియాలో వచ్చిన వార్తలను చూపుతూ అరెస్ట్ చేయరాదనే వాదనలు సరికాదని ఈడీ న్యాయవాది జోసెబ్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఈ కేసులో విచారణకు కల్వకుంట్ల కవిత సహకరించడం లేదు కనుకనే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని కనుక ఆమెను ప్రశ్నించడానికి 10 రోజులు కస్టడీ ఇవ్వాలని కోరారు.  

శనివారం ఉదయం నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ నాగ్ పాల్ పాల్ కల్వకుంట్ల కవితని ప్రశ్నించేందుకు వారం రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకోవచ్చని తీర్పు చెప్పారు.